Home / Legend Stories / Remembering Legendary NTR on His 26th Death Anniversary
ntr
ntr

Remembering Legendary NTR on His 26th Death Anniversary

నవరస నటనా సార్వభౌముడికి అక్షర నీరాజనం

మేఘాలు పూల వానలై కురిసిన రోజు. ఆ యమధర్మరాజు సైతం తన పదవి ఎక్కడ పోతుందా అని భయపడిన రోజు. ఇంద్రసభ రంభ, ఊర్వసి, మేనకలతో నాట్యమాడిన రోజు. దేవతలందరూ ఒక్కటై తామే తమలోకంలోకి మళ్లీ ప్రయాణమవుతున్నామని సంబరపడిన రోజు. ఇన్ని ఆనందాల పరవళ్లతో స్వర్గం తుళ్లి పడుతుంటే.. భూలోకంలోని ఆంధ్రలోకం మాత్రం కన్నీరై కరిగిపోతోంది. లక్షలాది హృదయాలు తమ రాముడు, కృష్ణుడు, విష్ణువు ఇక లేడని, రాడని బద్దలవుతున్నాయి. తెలుగువారి కీర్తి పతాక రెపరెపలు ఆగిపోతాయని విలపిస్తున్నాయి. ప్రతి ఇల్లు దుఃఖసంద్రమై లంగరేసిన నావలా ఆగిపోయింది. ఒక అప్రతిహత మానవ ప్రతిభ భూలోకం నుంచి అలా అలా స్వర్గలోకం వైపు నడిచి వెళ్లిపోయింది… అలా వెళ్లి పోయి ఈ రోజుకు సరిగ్గా 26 సంవత్సరాలు.

నందమూరి తారక రామారావు. ఎన్. టి. ఆర్. నవరస నటనా సార్వభౌమ. అశేష తెలుగు ప్రజల ఆరాధ్యదైవం. ప్రతి ఇంట్లో రాముడై, కృష్ణుడై, వెంకటేశ్వరుడై పూజలందుకొన్న కలియుగ మహాపురుషుడు. ఏ పాత్రైనా, ఏ డైలాగైనా, ఏ సన్నివేశమైనా… పౌరాణికం, జానపదం, చారిత్రకం, సాంఘికం… ఏ జానర్ అయినా అతనికి కరతళామలకం. డైలాగ్ చెప్పడం అంటే వెన్నెతో పెట్టిన విద్య. నేటి ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28 న పురుడుపోసుకున్న స్వచ్చమైన తెలుగు తేజం. చదువు సాగకపోయినా, పరీక్షల్లో ఫెయిల్ అయినా నటనమీద పెంచుకున్న మక్కువే ఆ ధిగ్గజాన్ని నటధిగ్గజం చేసింది. నాటకాల పిచ్చే సినిమాల్లో మహా మేరునగ ధీరుడ్ని చేసింది. ఏ పాత్ర వేసినా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసే కళాభినేత్రునిగా తీర్చి దిద్దింది. అందుకే ఎన్.టి. ఆర్. అంటే తెలుగుతెరకు ఇలవేల్పు. తెలుగు ప్రజలకు మేలు కొలుపు. జగ్గయ్య, ముక్కామల, నాగభూషణంతో కలిసి నాటక సమితుల్లో అభినయంతో పాటు దర్శకత్వాన్ని ఒంట పట్టించున్నాడు. మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగాన్ని పూచికపుల్లలా వదిలేసి కళామతల్లి సేవకై మద్రాసుకు పయనమయ్యాడు. పల్లెటూరి పిల్ల మొదటి అడుగైతే పాతాళభైరవి అతడిలోని నట భైరవికి నిదర్శనమైంది. ఆరోజుల్లోనే 10 కేంద్రాల్లో 100 రోజులాడి రామారావు నటనకు నాందిగా నిలిచింది. మాయాబజార్, సీతారామకళ్యాణం, అప్పుచేసి పప్పుకూడు, గుండమ్మకథ… ఒక్కటేంటి, ఒక పాత్రేంటి.. అన్ని పాత్రల్లోనూ మన రామారావే. మన ఎన్టీవోడే అనుకున్నారు ప్రజలు. రాముడంటే లవకుశ, కృష్ణడంటే శ్రీకృష్ణతులాభారం లా ప్రజల గుండెల్లో గుడికట్టుకున్నాడు. పురాణాల్లోని విలన్ పాత్రలను హీరోలు చేశాడు. కర్ణుడు, దుర్యోధనుడు, రావణాసురుడు… ఇలా నటనకు హీరో, విలన్ అనే తేడాలేదని రుజువు చేశాడు. ఇక చారిత్రకం, జానపదానికి వస్తే కత్తి తిప్పుతూ, కాలు ముందుకు వేస్తూ గంతులేస్తే ఎన్టీఆర్ కు తిరుగులేదని అభిమానులు నెత్తికెత్తుకున్నారు. రాజమకుటం, రాజపుత్ర రహస్యం, గండికోట రహస్యం, చిక్కడు – దొరకడు… జానపద బ్రహ్మకే బ్రహ్మగా పేరుతెచ్చుకున్నాడు.

చారిత్రక పాత్రల్లో సైతం తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు రామారావు, విక్రమాధిత్యుడు, అక్బర్, శ్రీకృష్ణదేవరాయలు. అశోక చక్రవర్తి… ఎన్నో పాత్రలకు ప్రాణం పోశాడు, చరిత్రకు సవాల్ గా నిలిచిన పాత్రల్లో తనదైన విలక్షణ నటన చూపి ప్రజలచేత శెభాష్ అనిపించుకున్నాడు. ఇక సాంఘికం దగ్గరకొస్తే రామారావు చేసిన డాన్స్ లు, కొత్త హిరోయిన్ లతో పాటలు… ఆపకుండా చెప్పే భారీ డైలాగులతో ప్రజలు అతడిని తమలో ఒకడిగా, తమ బాధలు తీర్చే నాయకుడిగా భావించుకున్నారు. తమ మనసుల్లో మహోన్నత స్థానం ఇచ్చారు. తమ ఇంట్లో వాడిగా భావించుకున్నారు. తమ కొడుకులకు రామారావు అని పేరు పెట్టుకున్నారు. జస్టిస్ చౌదరి, సర్దార్పాపారాయుడు, అడవిరాముడు, యమగోల ఇలా ఎన్నో సినిమాలు వారి కళాసాగరంలో సింధువులు, అమృత బిందువులు. తెలుగు ప్రజలకవి కళా రంగవళ్లులు. సినిమా చరిత్రలో మైలురాళ్లు.

రామారావు కేవలం నటుడే కాదు. దర్శకుడు. నిర్మాత కూడా. వారికి సినిమాలో ఉండే ప్రతి విభాగం మీద పట్టు ఉంది. దానవీర సూరకర్ణ అందుకు ఓ ఉదాహరణ మాత్రమే. మూడుపాత్రల్లో మెప్పించి, మహా నటుడంటే నందమూరే అని చాటాడు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిగా ప్రజలకు తత్త్వ బోధ చేశాడు. మేజర్ చంద్రకాంత్గా స్వాతంత్ర్యం అంటే బానిసత్వం కాదని మరోసారి నిరూపించాడు. మొక్కవోని పట్టుదల, ఎక్కడా వెనక్కు తగ్గని ఆత్మాభిమానం. కఠోరశ్రమ. నిరంతర ప్రయాణం. సాధనకై అహోరాత్రుల కృషి… ఇలా చెప్పుకుంటే పోతే నందమూరి తారకరామారావు సినీ జీవితం ఒక పుస్తకం మాత్రమే కాదు. ఎందరికో ఆదర్శం. ప్రతి తెలుగువాడు చదువుకోవాల్సిన చారిత్ర పుస్తకం. మనకు స్పూర్తి దాయకం. సినిమాల్లో అప్రతిహతంగా సాగిపోతున్న రామారావును ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నతో ప్రజలకు మంచిచేయాలన్న సంత్ సంకల్పంతో రాజకీయ్లలోకి అడుగుపెట్టాడు. తెలుగువారి గుండె చప్పుడైన తెలుగుదేశం పార్టీని 1982లో పెట్టాడు. 90రోజుల్లో 35వేల కిలోమీటర్లు తిరిగాడు. తన ప్రసంగాలతో ప్రజల గుండెలను గెలిచాడు.

మాటలతో మహా ప్రభంజనాలు సృష్టించాడు. అలుపెరుగని పోరులో తెలుగు నేలపై మొట్టమొదటి కాంగ్రేసేతర ముఖ్యమంత్రై చరిత్ర సృష్టించాడు. పాలు అమ్మిన చేతులతో ప్రజల కష్టాలు తీర్చే స్థాయికి చేరాడు. బడుగు, బలహీన వర్గాలకు అండదండగా నిలిచాడు. తెలుగు గంగ ప్రాజెక్టుతో రాయలసీమకు నీళ్లు తెచ్చేందుకు కృషి చేసాడు. స్త్రీలకు ఆస్తిలోవాటా దక్కాలని కోరుకున్నాడు. నక్సలైట్లూ దేశభక్తులే బ్రదర్ అంటూ సరికొత్త నిర్వచనాన్ని ఆర్థిక, సామాజిక కోణం నుంచీ ఆలోచించాడు. అగాథాలను, ఆనంద ఎత్తులను చవిచూశాడు. అలా 73 ఏళ్ల వయసులో 1996 జనవరి 18న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. తెలుగు ప్రజల గుండె బరువెక్కింది. కంటతడి పెట్టింది. అతడి దేహం పూలరథంపై హైదరాబాదు నగర వీధుల్లో వెళ్తుంటే అశేష జనవాహిని ఆరాధ్యదైవంగా అంజలి ఘటించారు. కన్నీరై కరిగిపోయారు. నీరంద్ర వర్షాణ నిర్దయగా చూస్తూ ఉండిపోయారు. ఏది ఏమైనా నందమూరి తారకరామారావు ఓ చారిత్రక పురుషుడు. ఓ ప్రభంజనం. ఓ ప్రతిధ్వని, ఓ సామ్రాజ్యనేత. ఓ ఆరాధ్యదేవుడు. అలాంటి దేవుడిలాంటి మనీషికి ఇదే మా అక్షర జ్ఞాపకాల నీరాజనం.

About admin

x

Check Also

AKHANDA Pre Release Event Live | Nandamuri Balakrishna, Pragya Jaiswal, Boyapati Srinu, Allu Arjun, SS Rajamouli, Thaman

Watch Dragon ball super